||సుందరకాండ ||

||ఇరువది నాలుగవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||


||ఓమ్ తత్ సత్||
శ్లో|| తతస్సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననః|
పరుషం పరుషా నార్య ఊచుస్తాం వాక్యమప్రియమ్ ||1||
స||రాక్షస్యః వికృతాననః తతః సీతాం ఉపాగమ్య అనార్య పరుషం పరుష అప్రియం వాక్యం తాం ఊచుః ||
తా|| వికృతమైన కళ్ళు గల రాక్షసస్త్రీలు అప్పుడు సీతను సమీపించి అవమానకరమైన పరుషమైన అప్రియ వచనములతో అమెతో ఇట్లనిరి.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చతుర్వింశస్సర్గః


వికృతమైన కళ్ళు గల రాక్షసస్త్రీలు అప్పుడు సీతను సమీపించి అవమానకరమైన పరుషమైన అప్రియ వచనములతో అమెతో ఇట్లనిరి.

"ఓ మనోహరమైన సీతా ! అతిమనోహరమైన శయనములతో ఒప్పారు అంతఃపురములో ఉండడానికి నీవు ఎందుకు అంగీకరించుటలేదు. నీవు మానవకాంతవు. మానవునకే భార్యగా ఉండుట గొప్పగా భావిస్తే నీమనస్సు మరల్చుకో. నీవు రాముని ఎప్పటికీ చేరజాలవు. రాక్షసేశ్వరుడు త్రిలోకభోగములనుఅనుభవించు రావణుని భర్తగా పొంది సుఖముగా విహరించుము. ఓ మంగళప్రదమైన దోషరహితమైన సీతా ! నువ్వు రాజ్యభ్రష్ఠుడు సిద్ధిపొందని మనుష్యుడు, కష్టములలో ఉన్న మనిషి అగు రామునే కోరుకొనుచున్నావు".

అప్పుడు కలువపూవు వంటి కళ్ళు గల సీత ఆ రాక్షస స్త్రీల మాతాలు విని భాష్పములు నిండిన కళ్లతో ఇట్లు పలికెను.

' ఇక్కడ కూడబడిన మీరందరిచేత చెప్పబడిన లోకములో నిదింపబడు మాటలు ఏవి ఉన్నాయో అవి నా మనస్సునకు కోంచెము కూడా ఒప్పవు. మానవ స్త్రీ రాక్షసుని భార్య అగుట ఎప్పటికీ తగదు. మీరందరూ నన్ను సుఖముగా తినుడు. మీ మాటలను నేను వినను. దీనుడైనా సరే. రాజ్యహీనుడైనా సరే. నాభర్తే నాగురువు. సువర్చల సూర్యుని అనుసరించినటులే నేను నా భర్తనే అనుసరించెదను. మహాపతివ్రతలైన శచి శక్రుని, అరుంధతి వశిష్ఠుని, రోహిణి చంద్రుని,లోపముద్ర అగస్త్యుని, సుకన్య చ్యవనుని, సావిత్రి సత్యవంతుని అనుసరించినటులే నేను రాముని అనుసరించెదను. మదయంతి సౌదాసుని , కేసిని సగరుని, భీముని దమయంతి నైషధుని అనుసరించినట్లు నేను ఇక్ష్వాకునాధుడగు రాముని అనుసరించెదను".

రావణునిచే ఆజ్ఞాపింపబడిన ఆ రాక్షస స్త్రీలు సీతయొక్క ఆ మాటలు విని క్రోధమూర్ఛితులై పరుషమైన వాక్యములతో భయపెట్టసాగిరి. శింశుపావృక్షములో దాగి యున్న ఆ వానరుడు మౌనముగా సీతాదేవిని బెదిరిస్తున్న ఆ రాక్షసస్త్రీల మాటలను వినసాగెను. వణికిపోతున్న ఆ సీతను చుట్టుముట్టి కోపముతో తమ పెదవులను మళ్ళీ మళ్ళీ నాకు కుంటు భయపెట్టసాగిరి.

ఆ రాక్షసస్త్రీలు తమ గొడ్రాళ్లను తీసుకొని ఇట్లు పలికిరి." ఈమె రాక్షసాధిపతి అగు రావణుని భర్తగా పొందుటకు అర్హురాలు కాదు." భయంకరులైన ఆ రాక్షసస్త్రీలచే భయపెట్టబడిన ఆ వరానన కన్నీళ్ళు కార్చుచూ శింశుపా వృక్షమువద్దకు వెళ్ళెను. ఆ విశాలాక్షి ఆ శింశుపా వృక్షమును సమీపించి రాక్షసస్త్రీలచే చుట్టబడియున్నదై, శోకములో మునిగియుండెను. ఆ రాక్షస స్త్రీలు దీన వదనముతో మలినమైన బట్టలను ధరించుచున్న సీతను మరింత భయపెట్టసాగిరి.

అప్పుడు భయంకరమైన రూపముగల వికృతమైన ఉదరముకల వినత అను పేరుగల రాక్షసి సీతతో ఇట్లు పలికెను.

"ఓ సీతా నీ భర్తపై ప్రేమ చూపించావు. అది చాలు. ప్రతీది అతిగా చేస్తే అది కష్టాలకి దారితీయును. మైథిలీ ! సంతోషిస్తున్నాను. నువ్వు నీ మానుష విధిని నిర్వర్తించావు. నీకు మంగళమగు గాక. ఇప్పుడు మేము చెప్పిన మాటలు వినుము. రాక్షసులందరికి రాజు, విక్రాంతుడు, రూపవంతుడు ఇంద్రుడు దేవేంద్రుడు లాగ త్యాగశీలుడు, అందరికీ ప్రియదర్శనుడు అయిన రావణుని భర్తగ పొందుము.మనుష్యుడు కృపణుడు అయిన రాముని వదిలి రావణుని ఆశ్రయించుము. ఓ వైదేహీ! దివ్యాభరణములతో అలంకరించుకున దానవై దివ్యమైన మైపూతలతో కలదానవై ఇప్పటినుంచి లోకములో అందరికీ మహారాణివై అగ్ని కి స్వాహా దేవి లాగా ఇంద్రుడిడికి శచీదేవి లాగా అనుభవింపుము. నీకు దీనుడు ప్రాణములు పోయినవాడు అగు రామునితో పని ఏమి? ఇలా నేను చెప్పిన మాటలు విని నీవు చేయకపోయినచో ఈ క్షణములో మేము నిన్ను భక్షించెదము".

వికటా అనబడు, వేలాడబడు స్తనములు కల, ఇంకొక రాక్షసి పిడికిని ఎత్తి గర్జిస్తూ సీతతో ఇట్లు చెప్పెను. "ఓ దుర్మతీ ! మైథిలీ ! అప్రియమైన మాటలు చాలాపలికావు. మా మంచితనముతో జాలితో వాటిని సహించాము. ఓ మైథిలీ ! కాలానుకూలమైన హితకరమైన మా మాటలు వినుటలేదు. దాటుటకు శక్యముకాని సముద్రముని దాటించి నీవు తీసుకురాబడినావు. రావణ గృహములో మాచేత రక్షింపబడుతున్న నిన్ను సాక్షాత్తు పురందరుడు కూడా రక్షింపలేడు. మైథిలీ! నీ హితము కోరు మా మాటలు వినుము. ఈ కళ్ళనీళ్ళు చాలు. అనర్థకమైన శోకమును విడువుము. ఈ విధమైన నిత్యదైన్యమును విడువుము. ప్రేమను సంతోషమును అనుభవించుము. ఓ సీతా రాక్షసరాజు తో యథాసుఖముగా అనుభవింపుము. ఓ పిరికిదానా ! ఈ యౌవ్వనము శాశ్వతము కాదు అని నీకు తెలుసు. అది గడిచిపోక ముందే సుఖమును అనుభవించుము. ఓ మదిరేక్షణ రమ్యమైన ఉద్యానవనములను, పర్వత ఉద్యానవనములను రాక్షసరాజుతో విహరించుము. ఓ సుందరీ నీకు ఏడువేల స్త్రీలు సేవ చేశెదరు. రాక్షసులందరి రాజగు రావణుని భర్తగా స్వీకరింపుము. మైథిలీ ఒకవేళ మేము చెప్పిన మాటలు వినకపోయినచో నీ హృదయముని పెకిలించి తినివేసెదము."

అప్పుడు క్రోధమూర్చితురాలైన చండోదరీ అనబడు రాక్షసి శూలము గిరగిరా త్రిప్పుచూ ఈ మాటలు పలికెను.

"ఈ కంపిస్తున్న స్తనములు గల హరిణలోలాక్షిని, రావణుడు అపరించి తీసుకు వచ్చినప్పుడు ఆమెను చూచి నాకు గొప్ప కోరిక గలిగెను. ఈమెను చంపి యకృత్తును, ప్లీహాన్ని, గుండెకాయను, ప్రేగులను, తలను తినాలని మహాకోరిక కలిగెను".

అప్పుడు ప్రఘసా అనబడు రాక్షసి ఈ మాటలు చెప్పెను. "ఈ కౄరురాలి కంఠము పీడించెదము. ఇంకా అలస్యము ఎందుకు? అప్పుడు రాజుకు ఆ మానుషీ చనిపోయినది అని నివేదించెదము. అప్పుడు అయన అమెను తినుడు అని చెపును. ఇందులో కోంచెము కూడా సందేహము లేదు".

అప్పుడు అజాముఖీ అను రాక్షసి ఈ వాక్యములను పలికెను. "ఈమెను చంపి అందరికీ సమానముగా భాగములను చేయుడు. అప్పుడు అందరము పంచుకుందాము. నాకు వివాదములు ఇష్టము లేదు. వెంటనే మద్యము పలువిధములైన లేహ్యములను తీసుకు రండు."

అప్పుడు శూర్పణఖా అనబడు రాక్షసి ఈ మాటలు చెప్పెను. "అజాముఖి చెప్పిన మాటలు నాకు నచ్చినవి. వెంటనే సర్వశోకవినాశిని అగు మద్యమును తీసుకురండు. ఈ మనుష్య మాంసము తిని నికుంభలానృత్యము చేద్దాము".

ఆ ఘోరమైన రాక్షస్త్రీలచేత ఈ విధముగా భయపెట్టబడిన దేవతలతో సమానమైన సీత ధైర్యము కోల్పోయి విలపింపసాగెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది నాలుగవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||

శ్లో|| ఏవం సంభర్త్స్యమానా సా సీతా సురసుతోపమా|
రాక్షసీభిః సుఘోరాభి ర్ధైర్యముత్సృజ్య రోదితి||48||
స|| సుఘోరాభిః రాక్షసీభిః ఏవం సంభర్త్స్యమానా సురసుతోపమా సా సీతా ధైర్యం ఉత్సృజ్య రోదితి||
తా|| ఆ ఘోరమైన రాక్షస్త్రీలచేత ఈ విధముగా భయపెట్టబడిన దేవతలతో సమానమైన సీత ధైర్యము కోల్పోయి విలపింపసాగెను
||ఓమ్ తత్ సత్||